Devisri Prasad: ‘ఎల్లమ్మ’తో హీరోగా మారనున్న దేవిశ్రీ ప్రసాద్.. జంటగా కీర్తి సురేశ్?
Devisri Prasad: సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన నట జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా నటుడిగా మారతారనే వార్తలు వినిపించినా, కేవలం పాటల్లో మాత్రమే అతిథి పాత్రలకు పరిమితమైన దేవిశ్రీ, ఇప్పుడు పూర్తి స్థాయి కథానాయకుడిగా తెరంగేట్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘బలగం’ ఫేం వేణు ఎల్దండి దర్శకత్వం వహించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో DSP హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించనున్నారు. ‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వేణు ఎల్దండి నుంచి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ కథానాయికగా నటించనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్‌రాజు సంస్థలో రెండు సినిమాలు చేయడానికి కీర్తి సురేశ్ అంగీకరించినట్లు సమాచారం. అందులో ఒకటి విజయ్ దేవరకొండతో చేయబోతున్న చిత్రం కాగా, రెండో ప్రాజెక్టుగా ‘ఎల్లమ్మ’ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వాస్తవానికి, ‘ఎల్లమ్మ’ కథ చాలా కాలంగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా ఉంది. గతంలో ఈ కథానాయకుడి పాత్ర కోసం నాని, నితిన్, ధనుష్ వంటి అగ్ర హీరోల పేర్లు వినిపించాయి. వివిధ కారణాల వల్ల ఈ కథ వారి వద్దకు చేరినా, ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరకు, వేణు ఎల్దండి అందించిన ఈ కథ DSPకి ఎంతగానో నచ్చడంతో, తన నట ప్రయాణాన్ని ప్రారంభించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న దేవిశ్రీ ప్రసాద్… నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు ఎల్దండి సహకారంతో నటుడిగా ఏ స్థాయిలో విజయం సాధిస్తారో చూడాలి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.