Dhanush: ‘కొలవెరి’ పాట శాపమా? వరమా?.. ఇన్నాళ్లకు నోరు విప్పిన ధనుష్.. ఏమన్నారంటే?
Dhanush: సినిమా ప్రపంచంలో వేలకొద్దీ పాటలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చరిత్రను తిరగరాసే పాటలు మాత్రం చాలా అరుదుగా పుడతాయి. సరిగ్గా 2011లో అలాంటి ఒక అద్భుతమే జరిగింది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఆ రోజుల్లో.. భాషతో సంబంధం లేకుండా యావత్ భారతదేశం మొత్తం ఒకే పాటను హమ్ చేసింది. అదే ‘వై దిస్ కొలవెరి డీ’. అప్పటి వరకు కేవలం తమిళ హీరోగా ఉన్న ధనుష్‌ను ఓవర్‌నైట్ గ్లోబల్ స్టార్‌ను చేసిన ఈ పాట గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘3’ సినిమా కోసం అరంగేట్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, హీరో ధనుష్ కలిసి కంపోజ్ చేసిన పాట ఇది. నిజానికి ఇది సినిమా కోసం చాలా సీరియస్‌గా ప్లాన్ చేసింది కాదు. స్టూడియోలో ఏదో సరదా కోసం (Just for fun), బ్రోకెన్ ఇంగ్లీష్ లిరిక్స్‌తో రికార్డ్ చేసిన ఈ ట్రాక్.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగానే సునామీ సృష్టించింది. ప్రస్తుతం 560 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట.. అప్పట్లో కాలేజీ క్యాంటీన్ల నుంచి పెళ్లి బరాత్‌ల వరకు ఎక్కడ చూసినా మార్మోగిపోయింది.
అయితే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఈ పాటపై ధనుష్ తాజాగా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ పాట తనను ఒక నీడలా వెంటాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ దేశంలో ప్రమోషన్‌లో ఉన్నా.. అందరూ ‘కొలవెరి’ గురించి మాత్రమే అడుగుతుంటారు. ఒకానొక దశలో నా నటనను, నాలోని ఇతర ప్రతిభను ఈ పాట డామినేట్ చేస్తుందేమోనని, జనం నా నటనను మర్చిపోతారేమోనని భయపడ్డాను” అని ధనుష్ తన ఆందోళనను బయటపెట్టారు.
“నిజం చెప్పాలంటే ఇది నాకు దక్కిన వరమా? లేక శాపమా? అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఈ పాట ఇచ్చిన క్రేజ్‌ను చూసి గర్వపడాలో, లేక దీని ఇమేజ్ నుంచి బయటపడటానికి పారిపోవాలో తెలియని సందిగ్ధంలో ఉండేవాడిని” అని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, ఆ ఒక్క పాట ధనుష్ మార్కెట్ రేంజ్‌ను పాన్ ఇండియా దాటి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిందన్నది కాదనలేని సత్యం. ఆ ‘కొలవెరి’ ఇమేజ్ దాటుకుని ఇప్పుడు ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన తీరు నిజంగా ప్రశంసనీయం.
