Kalam Biopic: అబ్దుల్ కలాం బయోపిక్‌పై కీలక అప్డేట్..!
Kalam Biopic: భారత మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కలాం’. ఈ బయోపిక్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ ధనుష్‌ను హీరోగా ఎంపిక చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలాం పాత్ర కోసం ధనుష్ కంటే మెరుగైన నటుడు దొరకరని ఆయన అభిప్రాయపడ్డారు. ధనుష్ అంగీకారం తెలపడం సంతోషంగా ఉందని, ఆయనతో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
కలాం పుస్తకాలే స్ఫూర్తి..
ఓం రౌత్ మాట్లాడుతూ, “కలాం జీవితం, ఆయన రాసిన పుస్తకాలు నా జీవితాన్ని మార్చాయి. ఆయన బయోపిక్‌ను తెరకెక్కించడం ఒక దర్శకుడిగా నాకు లభించిన అరుదైన అవకాశం. ధనుష్ ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని తెలిపారు. ఇతర సినిమాలతో పోలిస్తే బయోపిక్‌లను తెరకెక్కించడం ఒక పెద్ద సవాలు అని ఆయన పేర్కొన్నారు. ‘కలాం’ బయోపిక్‌కు సంబంధించిన తొలి ప్రకటన ఈ ఏడాది వేసవిలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఓం రౌత్ దర్శకుడిగా పరిచయమైంది కూడా ఒక బయోపిక్‌తోనే. బాలగంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా ఆయన రూపొందించిన తొలి చిత్రం ‘లోకమాన్య: ఏక్ యుగ్‌పురుష్’. ఆ తర్వాత ఆయన ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇటీవల ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ‘కలాం’ బయోపిక్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.