Ra One Shahrukh: షారుక్‌తో సినిమా చేసి చాలా కాలం కోలుకోలేకపోయా.. రా.వన్ సినిమా డైరెక్టర్
Ra One Shahrukh: బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనుభవ్ సిన్హా, తాను దర్శకత్వం వహించిన ‘రా.వన్’ (Ra.One) చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడం తనపై చూపిన ప్రభావాన్ని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. 2011లో సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో సినిమా, విడుదలైనప్పుడు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ పరాజయం తనను ఎంతగానో కలచివేసిందని, ఆ జ్ఞాపకాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన వెల్లడించారు.
“నేను ఇప్పటికీ ఆ సినిమా వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా మందిని అడిగినప్పుడు, ఇప్పుడైతే సినిమా బాగుందని చెబుతున్నారు. కానీ, విడుదలైనప్పుడు అది ఫ్లాప్ అయింది. షారుక్‌తో నేను చేసిన చిత్రం ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారు. ఆ వైఫల్యం నన్ను మానసికంగా చాలా దెబ్బతీసింది. దాని నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది” అని అనుభవ్ సిన్హా పాత చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
షారుక్ ఖాన్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయనతో మళ్లీ పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. షారుక్‌ను కేవలం ఒక స్టార్‌గా కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని, విలువలు తెలిసిన మనిషిగా తాను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. అగ్ర హీరో అయినప్పటికీ, ఆయన మధ్యతరగతి మనిషిలా ఉంటారని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని దర్శకుడు ప్రశంసించారు.
‘రా.వన్’ చిత్రాన్ని షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆయన సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, కథా కథనం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయినప్పటికీ, కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటం విశేషం.
