Kohli Biopic: కోహ్లీ బయోపిక్‌కు డైరెక్షన్ చేయలేను.. అతడో అద్భుతమే కానీ.. :అనురాగ్ కశ్యప్
Kohli Biopic: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కోహ్లీ బయోపిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం వచ్చినా తాను చేయనని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీపై తనకు అపారమైన గౌరవం ఉన్నప్పటికీ, బయోపిక్ తీసే ఆలోచన తనకు లేదని అన్నారు.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి హీరో. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అతడిని ఎంతో అభిమానిస్తారు. నేను ఏదైనా బయోపిక్ చేయాలనుకుంటే, ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని లేదా కష్టతరమైన సబ్జెక్టును ఎంచుకుంటాను. అప్పుడే ప్రేక్షకులకు కొత్తదనం చూపించగలను. కోహ్లీ అద్భుతమైన వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా అతడు తెలుసు. అందంతో పాటు వ్యక్తిత్వంలోనూ అతడు గొప్పవాడు. చాలా త్వరగా ఎమోషనల్ అవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ ఒక అద్భుతం.” అని ఎమోషనల్ అయ్యారు.
గతంలో కూడా విరాట్ కోహ్లీ బయోపిక్‌పై చాలా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందని, అందులో కోహ్లీ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారని ప్రచారం జరిగింది. ఆ వార్తలపై అప్పట్లో రామ్ చరణ్ స్పందిస్తూ, “కోహ్లీ నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్. ఎంతోమందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడు. అతడి పాత్రలో నటించే అవకాశం వస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అది నా జీవితంలో ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది” అని తన ఆకాంక్షను వెల్లడించారు.
అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలతో ఈ బయోపిక్‌పై మరోసారి చర్చ మొదలైంది. మరి భవిష్యత్తులో ఏ దర్శకుడైనా ఈ ప్రాజెక్ట్‌ను చేపడతారేమో చూడాలి.
