Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడికి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రోల్ కన్ఫర్మ్ చేసిన బాబీ
Raju Weds Rambai: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. తెలంగాణ నేపథ్యం, వినోదాత్మక కథాంశంతో దర్శకుడు సాయిలు కంపటి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని మంగళవారం చిత్రబృందం విజయ వేడుక (సక్సెస్ మీట్)ను ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు కంపటికి ఊహించని శుభవార్త చెప్పారు. సాయిలు కంపటి ప్రతిభను, ఈ సినిమా విజయాన్ని చూసి ముగ్ధులైన బాబీ, వేదికపైనే ఆయనకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ప్రస్తుతం బాబీ, మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో సాయిలు కంపటికి ఒక కీలక పాత్రను ఆఫర్ చేశారు. దర్శకుడిగా మెప్పించిన సాయిలును, నటుడిగా మెగాస్టార్ సినిమాలో భాగం చేయాలని బాబీ నిర్ణయించుకున్నారు. అగ్ర దర్శకుడి నుంచి మెగాస్టార్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సాయిలు కంపటి వెంటనే దానికి అంగీకారం తెలిపారు.
ఒక చిన్న సినిమా దర్శకుడికి, టాలీవుడ్ అగ్ర హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కడం అనేది అరుదైన గౌరవం. బాబీ కొల్లి ఈ వేడుకలో తన ఉదారతను చాటుకోవడం ద్వారా ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న సాయిలు కంపటి, ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటుడిగా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి. ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయిలు కంపటి నటన, దర్శకత్వం రెండింటిలోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
