Rahul Ravindran: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చున్నీ వివాదం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్
Rahul Ravindran: రష్మిక మందన్న కథానాయికగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఇటీవల ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి బయటపడే యువతి కథను శక్తివంతంగా చూపించడం ద్వారా ఈ సినిమా మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలోని భావోద్వేగభరితమైన క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించింది.
ఈ నేపథ్యంలో క్లైమాక్స్ చూసి చలించిపోయిన ఒక యువతి థియేటర్‌లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసి, తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ చున్నీని తీసివేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను గీతా ఆర్ట్స్ అధికారికంగా షేర్ చేయడంతో మరింత చర్చనీయాంశమైంది. అయితే ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. “చున్నీ తీయడం మహిళా సాధికారత ఎలా అవుతుంది?”, “చున్నీ అనేది మహిళల భద్రతకు చిహ్నం. దాన్ని తీసేయడాన్ని దర్శకుడు ప్రశంసించడం సరికాదు” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. సినిమాలో రష్మిక చున్నీ ధరించిందని, బయట సంప్రదాయాలను మార్చమని ప్రోత్సహించడం సరికాదని విమర్శకులు వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ విమర్శలన్నింటికీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ సంఘటన వెనుక ఎటువంటి పీఆర్ స్టంట్ లేదని, అది థియేటర్‌లో అనుకోకుండా జరిగిన యాదృచ్ఛిక సంఘటన అని ఆయన స్పష్టం చేశారు. “ఆ యువతిని నేను అప్పుడే మొదటిసారి కలిశాను. ఆ వీడియోను షేర్ చేయడానికి మొదట్లో నాకు భయం వేసింది, ఎందుకంటే కొంతమంది విమర్శకులు ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తారని అనుకున్నాను.
అనుకున్నదే జరిగింది. సినిమాలో చున్నీని ఒక సీన్ కోసం మాత్రమే ఉపయోగించారు. దుపట్టా తీసేయమని సినిమా ఎవరికీ చెప్పడం లేదు. పురుషులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చొక్కాలు విప్పితే ఎవరూ ప్రశ్నించరు. కానీ మహిళలు తమ భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తే ‘సంస్కృతి’ పేరుతో విమర్శించడం బాధాకరం” అని రాహుల్ పేర్కొన్నారు.
అంతేకాకుండా “సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎందుకు ఎప్పుడూ మహిళలకే అంటగట్టాలి?” అని ప్రశ్నిస్తూ, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి సినిమాలు ప్రస్తుతం సమాజానికి ఎంత అవసరమో ఈ వివాదమే స్పష్టంగా తెలియజేస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
