Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ
Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
‘స్పిరిట్’ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. గతంలో, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌పై కీలక విషయాలను వెల్లడించారు. ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ చివరి వారంలో ప్రారంభించబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నవంబర్ తర్వాత నిరంతరాయంగా షూటింగ్ కొనసాగి, ఈ చిత్రాన్ని 2026 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సందీప్ పేర్కొన్నారు.
అయితే గత కొంతకాలంగా సినీ వర్గాల్లో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ ఊహాగానాలపై తాజా ఇంటర్వ్యూలో సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, మెగాస్టార్ నటిస్తున్నారనేది కేవలం పుకారు మాత్రమే అని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయంలో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
ఇక, ఈ చిత్రంలో కథానాయికగా ‘యానిమల్’ బ్యూటీ తృప్తి డిమ్రీ నటించబోతున్నట్టు దాదాపు ఖరారైంది. ప్రభాస్ – సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్, పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
