Venky Atluri-Surya: వెంకీ అట్లూరి-సూర్య మూవీ టైటిల్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Venky Atluri-Surya: కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య ప్రస్తుతం తన 46వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు ప్రచారమయ్యాయి. ఈ పుకార్లపై వెంకీ అట్లూరి స్పందించి, వాటిని ఖండించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “మేము అనిల్ కపూర్‌ను కలిసినట్టుగానీ, ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టుగానీ లేదు. ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో కూడా మాకు తెలియడం లేదు. దయచేసి అటువంటి అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దు. అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడండి” అని స్పష్టం చేశారు. 45 ఏళ్ల క్రితం ‘వంశవృక్షం’ అనే తెలుగు సినిమాలో అనిల్ కపూర్ నటించిన తర్వాత, ఇప్పుడు సూర్య చిత్రంతో ఆయన తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే, దర్శకుడి తాజా ప్రకటనతో ఈ వార్తలకు ముగింపు పలికినట్లయింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎస్. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటీమణులు రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సూర్య మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై తెలుగు సినీ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది.
సూర్య చాలా ప్రతిభావంతుడని ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెంకీ తెలిపారు. ఇక ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాల తర్వాత వెంకీ దర్శకత్వంలో రానున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గా వస్తున్న ఈ సినిమాకు ‘ విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. కథకు తగ్గట్టు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసారని సమాచారం. విశ్వనాధం అండ్ సన్స్ వెంకీ అట్లూరి కిరీర్ లో బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని యూనిట్ ధీమాగా ఉంది.
