Dixit Shetty: రష్మిక పర్సనల్ లైఫ్, డేటింగ్ రూమర్లపై ‘ది గర్ల్‌ఫ్రెండ్’ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
Dixit Shetty: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో నిత్యం మారుమోగుతూనే ఉంటుంది. ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారో, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతోనూ అంతే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్‌లో ఉందంటూ, వీరిద్దరికీ త్వరలో ఎంగేజ్‌మెంట్ జరగబోతోందంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ రూమర్లపై రష్మిక సహనటుడు, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఫేమ్ దీక్షిత్ శెట్టి ఆసక్తికరంగా స్పందించారు.
కన్నడనాట మంచి గుర్తింపు తెచ్చుకుని, తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన దీక్షిత్ శెట్టి.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో విలేకరుల నుంచి ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో మీతో కలిసి నటించిన రష్మిక వ్యక్తిగత జీవితం గురించి, ఆమె పెళ్లి వార్తల గురించి మీకేమైనా తెలుసా? అని ప్రశ్నించగా.. దీక్షిత్ చాలా పరిణతితో, సున్నితంగా సమాధానమిచ్చారు.
“నేను సాటి నటీనటుల వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను. అది వారి ప్రైవసీకి సంబంధించిన విషయం. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను గౌరవించడం అనేది నాకు తెలిసిన సంస్కారం. సెట్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం కేవలం సినిమాల గురించి, షూటింగ్ అప్‌డేట్స్ గురించి మాత్రమే చర్చించుకునేవాళ్లం. అంతకు మించి ఆమె పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతోంది? ఆమె ప్రేమలో ఉందా? లేదా ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? అన్న విషయాల గురించి నేనెప్పుడూ అడగలేదు. నిజం చెప్పాలంటే నాకు ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఆసక్తి కూడా ఉండదు” అని కుండబద్దలు కొట్టారు.
షూటింగ్ సమయంలో బయట ఎంత పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చినా, తాను మాత్రం ప్రొఫెషనల్‌గానే వ్యవహరించానని దీక్షిత్ స్పష్టం చేశారు. కేవలం పని గురించే తప్ప, అనవసర విషయాల జోలికి వెళ్లనని ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సహనటి ప్రైవసీకి విలువ ఇస్తూ దీక్షిత్ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక – దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
