DNA: ముగ్గురు డీఎన్ఏలతో శిశువులు.. వంశపారంపర్య వ్యాధులను దూరం చేసిన కొత్త టెక్నిక్
ఆ ఒక్కటి ఉంటే ఎన్నో కోట్ల ఐశ్వర్యం ఉన్నట్లే. ఆ ఒక్కటి లేకపోతే ఎన్ని కోట్లు ఐశ్వర్యం ఉన్నా లేనట్లే. అదే ఆరోగ్యం. ఆరోగ్యం బాగోలేకపోతే ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నా వాటిని ఆస్వాదించలేం, ఆనందించలేం. అదే ఆరోగ్యం ఉంటే సంపాదించే కాస్తంత డబ్బునైనా ఆస్వాదించొచ్చు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు.
కోట్లాది రూపాయలు ఉన్నా ఏ రోగమూ రాకుండా హ్యాపీగా జీవించగలమన్న గ్యారెంటీ లేదు. చాలా మంది బాధపడేది, భయపడేది, ఆందోళన చెందేది ఆరోగ్యం గురించే. అందుకే అసలు ఆరోగ్య సమస్యలే రాకుండా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతే ఎంత బాగుంటుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ శాస్త్రవేత్తలు అది సాధ్యం చేసే పనిలో పడ్డారు.
ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో శిశువులకు ప్రాణం
తాజాగా బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్త్రంలో అద్భుత ఆవిష్కరణ చేశారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో శిశువులకు ప్రాణం పోశారు. ఇలా చేయడం ద్వారా జీవకణాల్లోని మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే జన్యుపరమైన వ్యాధులను నివారించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు కొత్త ప్రక్రియను అభివృద్ధి చేశారు. తల్లిదండ్రులతో పాటు మూడో వ్యక్తికి చెందిన డీఎన్ఏతో.. ఏకంగా 8 మంది ఆరోగ్యవంతమైన శిశువులకు ప్రాణం పోశారు.
వంశపారంపర్య వ్యాధులు లేకుండా..
తల్లికి చెందిన అండం, తండ్రికి చెందిన శుక్రకణంతో పాటు డోనర్ మహిళకు చెందిన రెండో అండాన్ని తీసుకుని కొత్త తరహాలో శిశువులకు ప్రాణం పోశారు. అలా పుట్టిన శిశువుల్లో మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే వంశపారంపర్య వ్యాధులు లేకుండా బిడ్డలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ముగ్గురు డీఎన్ఏలతో పుట్టిన పిల్లల్లో.. ఎక్కువగా తల్లిదండ్రులకు చెందిన జన్యు నిర్మాణమే ఉంటుందని, కేవలం 0.1 శాతం మాత్రమే మైటోకాండ్రియా దాతకు చెందిన జన్యు నిర్మాణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. లండన్‌లోని న్యూకాసిల్ ఫెర్టిలిటీ సెంటర్‌లో ఈ ప్రక్రియ చేపట్టారు.
సుమారు 5వేల మంది శిశువుల్లో ఒకరు మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులతో పుడుతారని, ముగ్గురి డీఎన్ఏతో ప్రతి ఏడాది 20 నుంచి 30 మంది శిశువులకు ప్రాణం పోసే అవకాశాలు ఉన్నట్లు న్యూకాసిల్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
