దేశంలోనే ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ప్రతి నిర్ణయంపై మీడియా ఒక కన్నేసి ఉంచుతుంది. పాలకమండలి తీసుకునే ప్రతి నిర్ణయం పై కూడా ప్రజల్లో ఆశక్తి వుంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ కేంద్రంగా వివిధ అంశాలు పై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి జగన్ బ్రహ్మోత్సవాలకు హాజరైన సందర్భంలో చెలరేగిన వివాదంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అంతకు ముందు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో నటుడు పృద్వి వైఖరితో వచ్చిన ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
ఇప్పుడు తాజాగా బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు తొలగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెట్టుబడులు పెడుతున్నారనే వార్త కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రచారం జరిగింది.అసలు స్వామి వారి సొమ్ముపై ప్రభుత్వాల పెత్తనం ఏమిటని కొందరు భక్తులు ఆందోళన చెందుతున్న క్రమంలో టీటీడీ దీనిపై వివరణ ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన రీత్యా అధిక ఆదాయం కోసం మాత్రమే పాలకమండలిలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఇందులో ఎటువంటి రహస్య అజెండా లేదని టీటీడీ బోర్డ్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశామని టీటీడీ పాలకమండలి వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెట్టుబడులు పెట్టె అవకాశం ఉన్నా టీటీడీ ఆ దిశగా ఆలోచించడం లేదని వారు తెలియజేసారు.1987 దేవాదాయ చట్టం ప్రకారం సెక్షన్ 111/3 జీవో 311 అనుగుణంగా చర్చ జరిగిందని, కానీ.. ప్రభుత్వం అన్ లాక్ 5 మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున శ్రీవారి డిపాజిట్లు బ్యాంకుల్లో మాత్రమే వుంటాయని టీటీడీ స్పష్టం చేసింది. దీనిపై కొన్ని ఛానల్స్ లో జరిగే దుష్ప్రచారాలు నమ్మవద్దని వారు భక్తులకు విజ్ఞప్తి చేసారు