న్యూ ఇయర్ పార్టీలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి..
* వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు.
* ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు.

* యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు.
నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి.
