Dulquer Salmaan: స్టార్ అనిపించుకోకపోతే కుర్చీ కూడా ఇవ్వరు.. బాలీవుడ్‌పై దుల్కర్ సల్మాన్ కామెంట్స్
Dulquer Salmaan: పరిశ్రమతో సంబంధం లేకుండా తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ సినీ ప్రపంచంలోని రెండు ప్రధాన చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసాన్ని తాజాగా వెల్లడించారు. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన తన అనుభవాలను ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాలీవుడ్‌లో నటీనటులను గుర్తించే తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
హిందీ చిత్రాల్లో పనిచేసేటప్పుడు, ఒక పెద్ద స్టార్‌గా గుర్తింపు లేకపోతే, తీవ్రమైన నిర్లక్ష్యం ఎదురవుతుందని దుల్కర్ పేర్కొన్నారు. “బాలీవుడ్‌లో నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉండేలా చూసుకునేవాడిని. నేను స్టార్‌ని అని అందరూ నమ్మేలా చేయాల్సి వచ్చేది. లేదంటే, కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా దొరకదు. షూటింగ్ మానిటర్‌ను చూడటానికి కూడా స్థలం ఇవ్వరు. మీ చుట్టూ జనాలు ఉంటేనే వారు మిమ్మల్ని పట్టించుకుంటారు. లగ్జరీ కార్లలో వస్తేనే ‘స్టార్’ అని గుర్తిస్తారు. ఇలాంటి భావన చాలా దురదృష్టకరం” అని దుల్కర్ తన అనుభవాన్ని వివరించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ‘లగ్జరీ’కి, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆయన పరోక్షంగా తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమ సెట్స్‌లో వాతావరణం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుందని దుల్కర్ చెప్పారు. “మలయాళ సినిమాల్లో ఎక్కువ ఖర్చు ఉండదు. లగ్జరీలకు ప్రాధాన్యం ఇవ్వరు. కేరళ రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. నటీనటులు తమ అవసరాల కోసం ఇంటి నుంచి అన్నీ తెచ్చుకుంటారు. చాలా ఖర్చులను సొంతంగానే భరిస్తారు” అని దుల్కర్ వివరించారు. అంటే, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆర్భాటం కంటే, పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
దుల్కర్ సల్మాన్ 2018లో ‘కార్వాన్’ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఆయన నటించిన ‘కాంత’ సినిమా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
