తిరుమల ఏడుకొండలలో కొలువై ఉన్న తిరుమల వెంకన్న సన్నిధిలో త్వరలో ఎలక్ట్రిక్ బస్ లు సందడి చేయనున్నాయి. పచ్చని చెట్లు సెలయేళ్ల తో ప్రకృతిని ఆస్వాదించే పర్యావరణ ప్రేమికులు చల్లని స్వామి వారి ఆశీస్సులకోసం ఇకమీదటి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం సాగించవచ్చు.
టెక్నాలజీ లేని రోజుల్లో భక్తులు నడక, గుర్రపు బండ్లు , ఎడ్ల బండ్ల మీద మాత్రమే తిరుమలకు చేరుకునేవారు. అయితే రోజులు మారే కొద్దీ నడక మార్గంతో పాటుగా రోడ్డు మార్గం సైతం అందుబాటులోకి వచ్చింది. అయితే రోజులు గడిచేకొద్దీ ప్లాస్టిక్ వాడకం కి అలవాటు పడిన ప్రజలు, పర్యావరణానానికి ఇబ్బంది కలిగించే ప్లాస్టిక్ ను విపరీతముగా తిరుమలలో కూడా వాడటం మొదలెట్టారు. దీంతో టీటీడీ (TTD) ఇప్పటికే తిరుమల కొండ మీద ప్లాస్టిక్ నిషేధించింది.
అయితే ప్లాస్టిక్ నిషేధం వాల్ల భూగర్భ కలుష్యం కొంతమేర తగ్గినా, వాయు కాలుష్యం మాత్రం ఇంకా అధికంగానే ఉంది. దీనికి ప్రత్యామ్నాయం గా దీనికి ఏకైక మార్గం ఎలక్ట్రికల్ వాహనాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీలో పనిచేసే విభాగాధిపతులకు ఎలక్ట్రికల్ వాహనాలను అందించిన టీటీడీ.
ఇకపై ఆర్టీసీ నడుపుతున్న డీజిల్ బస్సులు బదులుగా బ్రహ్మోత్సవాల నుంచి తిరుమలలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు నడపడానికి సర్వం సిద్ధం చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్ ల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎలక్ట్రిక్ బస్ ల వల్ల కాలుష్యం పూర్తిగా తగ్గి ఎల్లపుడూ ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమల లో నెలకొంటుంది. తిరుమలకి వచ్చే ప్రతి భక్తునికి శ్రీవారి ఆశీస్సులతో పాటుగా పచ్చటి ఏడుకొండలు అందాలు భక్తులని కనువిందు చేస్తాయి. వాయుకాలుష్య నివారణకు ఏపియస్ ఆర్టీసీ కూడా తన వంతుగా ఎలట్రికల్ వాహనాలు తిరుమలకు అందుబాటులోకి తీసుకురానుంది.
తిరుమల-తిరుపతి, తిరుపతి-ఎయిర్పోర్ట్ మధ్య మొత్తం 64 ఎలక్ట్రిక్ బస్సులని ఏపీఎస్ ఆర్టీసీ నడపనున్నట్టు సమాచారం. అలాగే తిరుపతి పట్టణం నుండి నాన్ స్టాప్ గా నెల్లూరు , మదనపల్లె, కడప పట్టణాలకు 12 ఎలక్ట్రిక్ బస్సులు చొప్పున నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ఘాట్‌లో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. రోజురోజుకు మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీ బస్సులను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు అధికారులు.
కాగా వచ్చే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్ లో ఈ బస్సుల డ్రైవింగ్ సంబంధించి విధివిధానాలు త్వరలో నిర్ణయిస్తామన్నారు. అలాగే డ్రైవింగ్ స్కూల్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన డ్రైవర్లు మాత్రమే ఈ బస్సు డ్రైవర్లుగా అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని తెలియజేశారు.
ఈనెల 27న తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ ప్రారంభిస్తాం అని అధికారులు స్పష్టం చేశారు.
