Emergency Alert to Smart Phones : కొద్దిసేపటి క్రితం దేశవ్యాప్తంగా చాలామంది ఫోన్లు మెసేజ్ తో మోగాయి. చాలామంది అది చూసి ఆ మెసేజ్ వెనక కారణమేమిటో అని భయపడ్డారు. ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది.. వారి మొబైల్ కె వచ్చిందా.. లేక అందరికీ వచ్చిందా.. అనే విషయం క్లారిటీ లేక అందరూ కంగారుపడ్డారు. ముందు ఇంగ్లీష్ లో తర్వాత హిందీలో తర్వాత తెలుగులో ఈ మెసేజ్ అందరి ఫోన్లను పలకరించింది. అయితే దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదని కాసేపటి తర్వాత విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఎమర్జెన్సీ నోటిఫికేషన్ సిస్టంను పరీక్షించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వమే ఈ మెసేజ్ ను పంపించినట్టు తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు గతంలో కూడా జులై 20 ఆగస్టు 15న కూడా ఇలాంటి మెసేజ్ లను కేంద్ర ప్రభుత్వం పంపించింది. దీని వెనక కారణమేమిటంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను అలర్ట్ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఉదయం 11:41 నిమిషాల కు ఒక పెద్ద సౌండ్ తో మెసేజ్ చాలామంది స్మార్ట్ ఫోన్లోకి వచ్చింది. ఆ తర్వాత 12:10 నిమిషాల సమయంలో మరో మెసేజ్ వచ్చింది. దీనిని కమ్యూనికేషన్స్ సెల్యులార్ బ్రాడ్‌కాస్ట్ సర్వీస్ విభాగం పంపించింది. “అత్యవసర హెచ్చరిక, తీవ్రమైన పరిస్థితి” అంటూ ఈ హెచ్చరిక మెసేజ్ వచ్చింది. ఏవైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రజలను వెంటనే అప్రమ్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ ఆపరేటర్లు , మొబైల్ సిస్టమ్‌ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు టెలికాం, మాస్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గతంలోనే తెలిపింది. మెసేజ్ రావడం వల్ల అందరూ దానిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేసారు.