Fawad Khan: భారీ రిలీజ్‌కు సిద్ధమైన పాకిస్థాన్ హీరో నటించిన ‘ఆబిర్ గులాల్’.. మరి భారత్‌లో..?
Fawad Khan: పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆబిర్ గులాల్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆగస్టు 29న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సినిమా భారతదేశంలో మాత్రం విడుదల కావడం లేదు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా దాదాపు 75 దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత వాయిదా..
ఆర్తి ఎస్ బాగ్ది దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవానికి మే 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి కారణంగా దీని విడుదల వాయిదా పడింది. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో, భారత్‌లో పాక్ కళాకారుల చిత్రాలపై నిషేధం విధించాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ వంటి సంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో, ఫవాద్ ఖాన్, హానియా, మహీరా ఖాన్, ఆతిఫ్ అస్లమ్ వంటి పాక్ నటుల సోషల్ మీడియా ఖాతాలను భారతదేశంలో నిలిపివేశారు.
‘సర్దార్ జీ 3’ కూడా రిలీజ్ కాలేదు..
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోవడంతో, ఈ సినిమా విడుదల మరింత సందిగ్ధంలో పడింది. ‘ఆబిర్ గులాల్’తో ఫవాద్ ఖాన్ భారతీయ సినిమాకు తిరిగి వస్తారని భావించిన తరుణంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం. గతంలో కూడా పంజాబీ నటుడు దిల్‌జిత్ దోసాంజ్ సినిమా ‘సర్దార్ జీ 3’ కూడా పాక్ నటులు ఉన్న కారణంగా భారతదేశంలో విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్‌లో మంచి విజయం సాధించింది. ‘ఆబిర్ గులాల్’ చిత్రాన్ని వివేక్ అగర్వాల్, అవంతిక హరి, రాకేష్ సిప్పీ నిర్మించారు. ఈ చిత్రంలో లీసా హేడన్, రిద్ది డోగ్రా, పర్మీత్ సేథ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.