Cinema Workers: సినీ కార్మికుల వేతనాల పెంపు.. ఎంత పెరిగాయంటే?
Cinema Workers: తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సినీ కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచుతున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber of Commerce) అధికారికంగా ప్రకటించింది. కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త వేతన ఒప్పందం ఆగస్టు 22, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.
కొత్త వేతన కార్డు ప్రకారం, మొదటి విడతగా ఆగస్టు 22, 2024 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలకు సూచించింది. ఈ పెంపుతో పాటు, పని పరిస్థితులు, ఇతర అలవెన్స్‌లు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే కొనసాగుతాయని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
జూనియర్ ఆర్టిస్టులకు కొత్త వేతనాలు
ఈ నూతన ఒప్పందంలో జూనియర్ ఆర్టిస్టులకు ప్రత్యేకంగా మూడు కేటగిరీలుగా వేతనాలను నిర్ణయించారు. దీని ప్రకారం, ‘A’ కేటగిరీలోని వారికి రోజుకు రూ. 1,420, ‘B’ కేటగిరీ వారికి రూ. 1,175, ‘C’ కేటగిరీ వారికి రూ. 930 చెల్లించనున్నారు. అలాగే, షూటింగ్ సమయంలో ఆహారం అందించని పక్షంలో ఉదయం అల్పాహారానికి అదనంగా రూ. 70, మధ్యాహ్నం భోజనానికి రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
కాల్‌షీట్ నిబంధనలు
కాల్‌షీట్‌కు సంబంధించిన వేతనాల్లోనూ మార్పులు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్‌షీట్‌కు రూ. 1,470 చెల్లించగా, హాఫ్ కాల్‌షీట్‌కు రూ. 735 నిర్ణయించారు. ఒకవేళ కాల్‌షీట్ సమయం నాలుగు గంటలు దాటితే, పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులకు వేతనాలు లేదా పని నిబంధనలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, వాటి పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీని సంప్రదించాలని ఫిల్మ్ ఛాంబర్ సూచించింది. కమిటీ ఏర్పడే వరకు కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21 తేదీ నాటి నిబంధనలను అందరూ పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కోరారు. ఈ నిర్ణయం వేలాది మంది సినీ కార్మికుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.