Balakrishna: బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన మాజీ సీపీ సీవీ ఆనంద్..
Balakrishna: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ఒక చిన్న ఎమోజీ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో నెలన్నరపాటు తీవ్రమైన ఫ్యాన్ వార్‌కు కారణమైంది. ఈ వ్యవహారంపై నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరదించుతూ, సీవీ ఆనంద్ తాజాగా స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
దాదాపు రెండు నెలల క్రితం అంటే సెప్టెంబర్ 29న, సినిమా పైరసీ, డిజిటల్ లీకేజీ, బెట్టింగ్ యాప్‌లపై సినీ ప్రముఖులతో సీవీ ఆనంద్ ఒక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య వంటి అగ్ర నటులు హాజరయ్యారు. ఈ సమావేశం గురించి ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై బాలకృష్ణ అభిమాని ఒకరు, “మా బాలకృష్ణను మీటింగ్‌కు ఎందుకు పిలవలేదు?” అని ప్రశ్నిస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతారని కామెంట్ చేశారు.
ఈ కామెంట్‌కు సీవీ ఆనంద్ బదులిస్తూ, నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత బాలయ్య విమర్శకులు, అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. ఈ గొడవలో తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. నగరానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, కేసుల కారణంగా వెంటనే స్పందించలేకపోయానని ఆయన వివరించారు.
తాజాగా చేసిన సుదీర్ఘ పోస్ట్‌లో, బాలకృష్ణ అభిమాని అడిగిన ప్రశ్నకు కేవలం ఒక ఎమోజీతో స్పందించడం పూర్తిగా అనవసర నిర్ణయం అని సీవీ ఆనంద్ అంగీకరించారు. ఆ పోస్ట్ వివాదానికి దారి తీసిందని తెలుసుకున్న వెంటనే దానిని తొలగించానని తెలిపారు. అంతేకాకుండా, వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత బాలకృష్ణకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి తన క్షమాపణలు తెలియజేసినట్లు వెల్లడించారు.
“నేను బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి నటుల సినిమాలు చూస్తూ పెరిగాను. వారందరితో నాకు మంచి స్నేహం, గౌరవం ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి మూలమైన ఎమోజీ పోస్ట్‌తో పాటు మరికొన్ని తప్పుడు పోస్టులు చేసిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌ను కూడా ఇప్పటికే తొలగించానని ఆయన తెలిపారు.
చివరిగా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను, ఇరువర్గాల వారిని సీవీ ఆనంద్ కోరారు. ఆయన వివరణ మరియు క్షమాపణతో బాలకృష్ణ అభిమానులు కూడా శాంతించడంతో, దాదాపు రెండు నెలల పాటు సోషల్ మీడియాను ఊపేసిన ఈ ఎమోజీ వివాదం సుఖాంతమైనట్లైంది.
