దాళ్వా కోతలు వచ్చేటప్పుటికి మా గోదావరి పల్లెల్లో సందడి మొదలవుతుంది. మేస్త్రి సత్తిరాజు, తరపట్ల ఆనందరావు గారి ట్రాక్టర్లో పొద్దు పొడవక ముందే లేబర్ ని ఎక్కించుకుని అద్దరికి చించినాడ బ్రిడ్జి దాటి పాలకొల్లు మీదుగా భీమవరం ప్రాంతాల్లోకి తీసుకుని వెళ్ళేవాడు.
జోడికి మూడు వందల రూపాయలు రెండు కేజీల బియ్యం కింద కూలి వచ్చేది. ఇక్కడ కోతలు అయిపోగానే సత్తిరాజు బంటా భీమవరం వెళ్లిపోయేవారు.అక్కడ కొంతమంది రాజులతో సత్తిరాజుకు పరిచయాలు ఉండేవి.
పనుల్లేని కాలంలో పస్తులు తప్పించి, పని ఇప్పించిన సత్తిరాజు వాళ్ళకి దేవుడిలా కనిపించే వాడు. కూలీలు పని అయ్యాక రాజులు ఇళ్ల దగ్గర చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళు కాసింత ఆవకాయ పచ్చడి, వారు తినగా మిగిలిన కూరలు ఇస్తే ఒక పండుగ పూట పరమాన్నంలా తినేవారు కూలీలు.
వాళ్ళింట్లో ఏదైనా శుభకార్యాలు అయితే కూలీలు మొత్తానికి బోజనాలకి రమ్మని కబురు పెడితే సంబరంగా అందరూ వెళ్లి తినొచ్చేవారు.అదొక ఆత్మీయ సంబందంలా అల్లుకుని పోయి ఒక జీవవ విధానానికి దర్పణం పట్టేది.
దేశం కోసం ఆటలు ఆడి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఆటగాళ్ల వేలం గురించి కూడా ఈ మధ్య విన్నాను. అదేదో ఐపీఎల్ అంట. వాళ్ళక్కడా దేశం తరపున ఆడరు.బ్యాంకులకు బొక్కెట్టి దేశంలో అడ్డమైన పనులు చేసి డబ్బులు సంపాదించిన పెద్దమనుషులు కొంతమంది వీళ్ళని కొనుక్కుంటారు. వీళ్ళు సంతలో గేదెల్లా ఎవడు ఎక్కువకు కొనుక్కుంటే వాళ్ల వెనుక బ్యాట్ ఊపుకుంటూ వెళ్ళిపోతారు.
కొన్ని చిత్రమైన పేర్లతో టీమ్ లు పెడతారు. ధోని ని ఔట్ ఎవడో పరాయి దేశం బౌలర్ ఔట్ చేస్తే విరాట్ కోహ్లీ గంతులు వేస్తాడు. కొంతమంది రంగురంగుల గుడ్డలు కట్టుకుని, చేతుల్లో గోడకు సున్నం వేసుకునే చీపుర్లు పట్టుకొని కొట్టిన ప్రతి ఫోర్ కి కారణం లేకుండా ఎగురుతారు. కొంతమంది అందమైన హీరోయిన్లు తమ జట్టుని గెలిపించిన నల్లటి విదేశీ క్రికెటర్ కి ముద్దులు పెడతారు.
డబ్బు కోసం ఆడే ఈ ఆటలో ప్రతి అడుగు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. రేట్లని బట్టి ఆట.. ఆటని బట్టి రేటింగ్. జనాల మోజుని డబ్బుగా మార్చుకునే వికృత క్రీడా విన్యాసాలు కదూ ఇవి.
వీళ్ళతో పోలిస్తే కూలీలని ఆదరించిన రైతులకే విలువ ఎక్కువ అనుకోవచ్చు. జ్వరం వచ్చి పని చెయ్యలేకపోయినా కూలీ ఇచ్చి పంపించిన సగటు రైతు దగ్గర ఉన్న మానవత్వం ఈ జట్టు యజమానులకి ఉంటుందా?ఆడకపోతే తీసేసి కొత్తఆటగాడిని పెట్టుకునే కుబేరుల కంటే.. అందరినీ కలుపుకొని పోయే జట్టు మేస్త్రి సత్తిరాజే బెటరు మా గోదారోళ్ళ దృష్టిలో.
