Groom Runs Away: అమ్మాయితో పెళ్లి.. అదేరోజోజు మొదటి భార్యతో పరారైన పెళ్లికొడుకు
Groom Runs Away: పెళ్లి ముహూర్తానికి సిద్ధమైన వరుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో వధువు తరఫు వారు షాక్‌కి గురయ్యారు. పెళ్లికొడుకు కనిపించకుండా పోవడం వెనుక అసలు కారణం తెలిసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచి రెండో వివాహానికి సిద్ధపడిన వరుడు, ముహూర్తం కాసేపట్లో ఉందనగా తన మొదటి భార్యతో కలిసి పరారైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం జరిగింది.
దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణ అనే వ్యక్తికి, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన ఓ యువతితో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. బంధుమిత్రులు అంతా పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వరుడు సత్యనారాయణ హఠాత్తుగా కనిపించడం లేదని ఆయన బంధువులు వధువు కుటుంబానికి ఫోన్‌లో చెప్పారు. దీంతో వధువు తరఫు వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వధువు కుటుంబానికి ఊహించని విషయం తెలిసింది. సత్యనారాయణకు ఇప్పటికే వివాహం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల కిందట ఓ మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు అదివరకే వేరొక వ్యక్తితో పెళ్లి అయింది. సదరు మహిళ భర్త చనిపోవడంతో ఆమెతో అతగాడు వివాహేతర సంబంధం కొనసాగించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.
అంతేకాకుండా, ఆ మహిళ కుమార్తె పెళ్లి కూడా సత్యనారాయణే జరిపించాడని పోలీసులు వధువు కుటుంబ సభ్యులకు వెల్లడించారు. అయితే సత్యనారాయణ తనను వదిలి మరొక మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఆ మహిళ.. తనకు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి కేసు పెడతానని, వధువు బంధువులను తమ విషయం చెబుతానని హెచ్చరించింది.
దీంతో భయపడ్డ సత్యనారాయణ పెళ్లికి ముందే పారిపోయి తన మొదటి భార్య వద్దకు వెళ్లినట్లు పోలీసులు వధువు కుటుంబసభ్యులకు వివరించారు. దీనిపై సీఐ బి.నాగేశ్వర నాయక్ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని, పెళ్లి కుమార్తెకు న్యాయం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
