ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ లో జరిగిన పైశాచిక అత్యాచార కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సిబిఐ విచారణలో దోషులకు శిక్ష పడుతుందని జనసేన విశ్వసిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ గళం విప్పాలనీ.. ఆడపిల్లల జీవితాలకు ఈ సమాజం భరోసా ఇవ్వాలని, వారు స్వేచ్ఛా, స్వాతంత్య్రాల తో జీవించే విధంగా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక కేసులో జనసేన ముందుండి న్యాయం కోసం పోరాడుతున్న సంగతి ఆయన గుర్తు చేశారు. ఈ కేసును సి.బి.ఐ దర్యాప్తుకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంతవరకు సీబీఐ నుండి ఈ కేసు పై అధికారిక ప్రకటన విడుదల కాలేదని, ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలని, శాసన సభలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జాతీయ మీడియా సుగాలి ప్రీతి కేసుకు తగినంత ప్రాధాన్యం ఇచ్చి దోషులకు శిక్ష పడేలా కృషిచేయాలని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.