Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక.. ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్
Hansika Motwani: సినీ రంగంలో ప్రేమ, వివాహాలు ఎంత తొందరగా జరుగుతాయో, అంతే వేగంగా విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణమైపోయింది. తాజాగా.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్రనటిగా వెలుగొందిన హన్సిక మోత్వానీ వైవాహిక జీవితంపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2022లో అంగరంగ వైభవంగా వివాహం..
2022 డిసెంబర్‌లో వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఒక డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా చిత్రీకరించి ప్రసారం చేశారు. అయితే, వివాహం జరిగిన కొద్ది కాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, హన్సిక తన పుట్టింటికి తిరిగి వచ్చారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్తలను సోహైల్ ఖండించినప్పటికీ, హన్సిక మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం హన్సిక తీసుకున్న ఈ నిర్ణయం.. ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయనే వార్తలకు స్పష్టత ఇస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. మొదటిసారి సోహైల్ ప్రపోజ్ చేసినప్పటి ఫోటోల నుంచి, వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోల వరకు అన్నీ తొలగించడంతో, విడాకులు దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
సినీ రంగంలో ప్రేమ, వివాహాలు ఎంత తొందరగా జరుగుతాయో, అంతే వేగంగా విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణమైపోయింది. అనేక మంది సెలబ్రిటీలు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతుండటంతో, ఇప్పుడు హన్సిక, సోహైల్‌ల బంధం కూడా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే, హన్సిక ఇటీవలే ‘గార్డియన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘శ్రీ గాంధారి’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. హన్సిక ఇందులో హిందూ ట్రస్ట్ కమిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శతాబ్దాల నాటి గంధర్వ కోటలోకి అడుగుపెట్టే ఈ ఆఫీసర్ పాత్ర చిత్రంలో ఎలాంటి మలుపులు తెస్తుంది అనేది ఆసక్తికరంగా మారనుంది.