Hari Hara Veera Mallu: ఓటీటీలోకి ‘హరి హర వీరమల్లు’.. ట్విస్ట్ ఇచ్చిన మూవీ టీమ్..
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా ‘హరి హర వీరమల్లు’ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. గత నెల 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నాలుగు వారాల తర్వాత ఊహించని విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే, థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కి, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెర్షన్‌కి చాలా తేడాలు ఉన్నాయని నెటిజన్లు గుర్తించారు. దాదాపు 15 నిమిషాల నిడివిని చిత్రబృందం కట్ చేసిందని తెలుస్తోంది.
థియేటర్లలో సినిమా విడుదలైనప్పుడు, కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ (VFX) నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గుర్రపు స్వారీ చేసే సన్నివేశం, బాణం గురిపెట్టే సీన్స్ విషయంలో పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ఈ సన్నివేశాలను పూర్తిగా తొలగించినట్లు సమాచారం. అలాగే, సినిమా చివరి భాగంలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని బాబీ దేవోల్ సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు కూడా కట్ అయినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ‘అసుర హననం’ పాట తర్వాత నేరుగా ‘పార్ట్ 2’ ప్రకటనతో సినిమాను ముగించారని సమాచారం. ఈ మార్పుల వల్ల సినిమా వేగం పెరిగిందని, నిడివి కూడా తగ్గిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన కొంత చిత్రీకరణ కూడా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది.
https://x.com/PrimeVideoIN/status/1957883189277467055
వీరమల్లు నిర్మాణం, రెమ్యునరేషన్స్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకుని సుమారు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కానీ, ఇండియాలో మాత్రం ఆ మైల్ స్టోన్ చేరుకోలేకపోయింది. ఓవరాల్గా 14 రోజుల్లో రూ. 84.55 కోట్ల ఇండియా నెట్, వరల్డ్ వైడ్గా రూ.120 కోట్లకి పైగాగ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి.