హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అసలే మెగాస్టార్. ఆయన ఎదురుగా కనిపిస్తే అక్కడున్న వారు ఆగుతారా? ఫోటోల కోసం ఎగబడ్డారు. ఈ లోపు ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహారావు ప్రసంగం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఉన్న జనానికి అదేం పట్టలేదు. ఆయన్ని పట్టించుకోలేదు. స్టేజ్ పై చిరంజీవి ఉండడం తో అక్కడ ఉన్న వారు ఎగబడ్డారు. చిరంజీవి పలకరిస్తూ ఆయనతో సెల్ఫీలు దిగసాగారు.
దీంతో అప్పుడే ప్రసంగం మొదలుపెట్టిన గరికపాటి “చిరంజీవి గారూ.. మీరు ఫోటోలు దిగడం ఆపితేనే నేను ప్రసంగం మొదలు పెడతాను. లేకపోతే మధ్యలోనే వెళ్లిపోతాను” అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో గరికిపాటి పక్కన ఉన్న వారు అవాక్కయ్యారు. ఆయన్ని వారించారు. చిరంజీవి మాత్రం వెంటనే స్టేజి దిగి వచ్చి “గరికపాటి ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని ఒక రోజు తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా” గరికపాటిని ఆహ్వానించారు.
నిన్న జరిగిన ఈ సంఘటనని గమనిస్తే చిరంజీవి స్టేజ్ మీద ఉండగా జనం ఆయన్ని చుట్టుముట్టారు. ఆయన చుట్టూ మూగి సెల్ఫీలు దిగసాగారు. ఈలోపు కింద ఉన్న గరికపాటి వారు ప్రసంగం మొదలుపెట్టారు పైన జరుగుతున్న హడావుడిలో ఎవరూ కింద ఈయన మాట్లాడుతున్న విషయం గమనించక పట్టించుకోలేదు. అది క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది.
ఇంత హడావుడిలో ప్రసంగం మొదలుపెట్టి మళ్లీ గరికిపాటి వారు చిరంజీవి గారిపై ఇలా మాట్లాడడం బాగాలేదని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఇందులో చిరంజీవి తప్పేం ఉందనీ.. చిరంజీవిని అలా అవమానించడం కరెక్ట్ కాదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవి తిరిగి గరికపాటి పై వ్యవహరించిన తీరుకి మాత్రం జనం ఫిదా అయ్యారు. ఆయన సంస్కారానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం వల్లనే ఆయన మెగాస్టార్ అయ్యారంటూ కొనియాడుతున్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి తమ్ముడు, మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏ పాటి వాడి కైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ గరికపాటి పేరు ప్రస్తావించకుండా సెటైరికల్ ట్విట్ చేశారు.