Kubera OTT Release: అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా సినిమానే కుబేర. జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్.. ఈరోజు (జూలై 18) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్లకు పైగా (ప్రపంచవ్యాప్తంగా) వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. భారత దేశంలోనే సుమారు రూ. 90 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. థియేటర్లలో విజయవంతమైన నాలుగు వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం.
రూ.50 కోట్లకు పైగా వెచ్చించి మరీ హక్కులు సొంతం
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ. 50 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది ధనుష్, నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక ఓటీటీ డీల్‌లలో ఒకటిగా నిలిచింది. ‘కుబేర’ కథాంశం ఒక సామాజిక-రాజకీయ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ధనుష్ ‘దేవా కల్లమ్’ అనే బిచ్చగాడి పాత్రలో కనిపించగా.. నాగార్జున ‘దీపక్ తేజ్’ అనే మాజీ సీబీఐ అధికారి పాత్రను పోషించారు. వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణ, కుట్ర, అధికారం చుట్టూ కథ అల్లుకుంది.
బిచ్చగాళ్లను బినామీలుగా వాడుకుని..
డబ్బును అక్రమంగా తరలించడానికి బిచ్చగాళ్లను బినామీ ఖాతాదారులుగా మార్చే ఒక ప్రమాదకరమైన కుట్రలో దేవా ఎలా చిక్కుకున్నాడు, ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపించారు. రష్మిక మందన్న ‘సమీరా’ అనే కీలక పాత్రలో నటించగా.. జిమ్ సర్భ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, సునయన, హరీష్ పెరాడి, శ్రావణి వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.