Nithin: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన నితిన్.. ఏంటంటే..?
Nithin: టాలీవుడ్ యువ హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ దంపతులు తమ కుమారుడి పేరును ఎట్టకేలకు అభిమానులతో పంచుకున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 6న వీరికి పండంటి మగబిడ్డ జన్మించినా, ఇప్పటివరకు ఆ చిన్నారి ఫోటో కానీ, పేరు కానీ వెల్లడించలేదు. తాజాగా కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా, తమ కుమారుడికి ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినట్లు నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ పేరు వెనక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యంతో ప్రశంసిస్తున్నారు.
నితిన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, “ఈ జన్మాష్టమి మా హృదయాలను సంతోషంతో నింపింది. మా కుమారుడికి ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉంది. వాడు మా జీవితాల్లో ఎప్పటికీ ఓ చిన్న కృష్ణుడిలాగే ఉంటాడు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ పేరు విన్న తర్వాత నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పేరు చాలా ప్రత్యేకంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఈ పేరు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురించి చర్చించుకుంటున్నారు.
‘అవ్యుక్త్’ అనే పదానికి శాశ్వతమైన, స్వచ్ఛమైన అని అర్థాలు ఉన్నాయి. హిందూ తత్వశాస్త్రంలో ఈ పదం పరమాత్మ లేదా ప్రకృతి యొక్క మూలాన్ని సూచిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ పేరు ఉన్నవారు ఆధ్యాత్మికతపై ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన, ధైర్యం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని విశ్వసించారు. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న నితిన్-షాలినీ దంపతులు, దాదాపు 11 నెలల తర్వాత తమ కుమారుడికి ఈ ప్రత్యేకమైన పేరు పెట్టారు.
సినిమాల విషయానికి వస్తే, నితిన్ ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన ‘తమ్ముడు’ మరియు ‘రాబిన్ హుడ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం, ఆయన ‘బలగం’ చిత్ర దర్శకుడు వేణు యెల్దండితో కలిసి ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం నితిన్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.