Hero Vishal: విశాల్ పెళ్లి అప్పుడే.. వివరాలు పంచుకున్న హీరో.. వేదిక ఎక్కడంటే?
Hero Vishal: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత విశాల్ తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికి, నటి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య అత్యంత నిరాడంబరంగా జరిగింది. తన నిశ్చితార్థం అనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
విశాల్ గత తొమ్మిదేళ్లుగా తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు. ‘నడిగర్ సంఘం’ భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తాను గతంలోనే మాట ఇచ్చానని చెప్పారు. ఈ నిర్ణయానికి ధన్సిక కూడా అంగీకరించడంతో ఇన్ని సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. “ఇది నా బ్యాచిలర్ లైఫ్‌లో చివరి పుట్టినరోజు. ‘నడిగర్ సంఘం’ భవనం పూర్తి కావాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. మరో రెండు నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుంది. దాని ప్రారంభోత్సవం జరిగిన వెంటనే మా వివాహ తేదీని ప్రకటిస్తాం” అని విశాల్ తెలిపారు.
ఇప్పటికే ఆ భవనంలోని ఆడిటోరియాన్ని తమ పెళ్లి కోసం బుక్ చేసుకున్నామని, అక్కడ జరిగే మొదటి వివాహం తమదే అవుతుందని విశాల్ స్పష్టం చేశారు. ఆగస్టు 29న జరిగిన తన నిశ్చితార్థం వేడుక గురించి విశాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “పుట్టినరోజు నాడే నిశ్చితార్థం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను” అంటూ ఆయన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పంచుకున్నారు.
ధన్సికతో విశాల్ నిశ్చితార్థం చేసుకున్నారన్న వార్తతో ఆయన అభిమానులు ఆనందంతో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విశాల్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, విశాల్ ప్రస్తుతం రవి అరసు దర్శకత్వంలో ‘మకుటం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్‌లు కథానాయికలుగా నటిస్తుండగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది.