Dimple Hayathi: మరో వివాదంలో హీరోయిన్ డింపుల్ హయతి.. పనికి పిలిచి యువతులకు వేధింపులు
Dimple Hayathi: ‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలలో నటించిన హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసులు, ఐపీఎస్ అధికారులతో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈమె, ఇప్పుడు తన ఇంట్లో పని మనుషులతో వ్యవహరించిన తీరుపై కేసు నమోదైంది. జీతాలు ఇవ్వకుండా, చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ ఆమెపై ఫిర్యాదు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు డింపుల్ హయతి ఇంట్లో కొంతకాలంగా పని చేస్తున్నారు. అయితే, వారికి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా, వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా వేధించారని బాధితులు ఆరోపించారు. తమ జీతాలు అడిగితే, డింపుల్ హయతి, ఆమె భర్త దాడులకు దిగి, లాయర్ అంటూ బెదిరించారని వారు తెలిపారు. దీంతో, డింపుల్ హయతి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ముందు ఆందోళనకు దిగారు.
ఈ ఆందోళన నేపథ్యంలో, బాధిత పనిమనిషి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను నగ్నంగా చేసి కొట్టడానికి ప్రయత్నించారని, తమ పెంపుడు కుక్క మొరిగిందని సాకుగా చూపి హింసించారని, నగ్న వీడియోలు కూడా తీసేందుకు ప్రయత్నించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హీరోయిన్ డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. సినీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై డింపుల్ హయతి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
2017లో ‘గల్ఫ్’ మూవీలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో ఫేమస్ అయింది. ఆ తర్వాత రవితేజతో ‘ఖిలాడీ’, విశాల్‌తో ‘సామాన్యుడు’, గోపీచంద్ సరసన ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ఆకట్టుకునే అందం, ఫిగర్ ఉన్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘భోగి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
