ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర DGP గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి లో వెంకట రాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. దీనిపై వెంకట రాజు మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుందని, పోలీసులను అదుపు చేయలేక పోతే డిజిపి రాజీనామా చేయాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అసలు అమలవుతుందా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మధ్యకాలంలో హెబియస్ కార్పస్ పిటిషన్ లు ఎక్కువగా వస్తున్నాయని, వీటి పై మూడుసార్లు జుడిషియల్ విచారణ జరిపితే పోలీసులదే తప్పని తేలిందని, పదే పదే ఇదేవిధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో వెంకటపతిరాజు అనే వ్యక్తిని అమలాపురం పోలీసులు ఈనెల ఆరో తేదీన రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా అదుపులోకి తీసుకున్నారని దాఖలైన పిటిషన్ ను రేపటికి వాయిదా వేశారు.