Himalayan Mountains : చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే హిమాలయ పర్వతాలు రోజురోజుకి కాస్త కరిగిపోతున్నాయంటా..! వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా..! కానీ ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ లో తేలింది ఏమిటంటే.. హిమాలయాలు కరిగిపోవడం కారణంగా రెండు బిలియన్ల మంది జీవితాలు జీవనోపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని తేలింది.
2011 నుంచి 2020 మధ్య కాలంలో 65% వరకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలైన ఆసియా హిందూ కుష్ హిమనీనదులు కరిగిపోతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇదే శతాబ్దం చివరినాటికి 80 శాతం మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ తాజా రిపోర్ట్ లో వెల్లడించింది. దీని ఫలితంగా 16 దేశాలలో ప్రవహించే 12 నదులలో మంచినీటి సరఫరా తగ్గిపోతుందని పేర్కొంది.
ఈ పర్వత శ్రేణులు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పు మాయన్మార్ వరకు 3500 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండడంతో మంచు కరుగుతున్న నేపథ్యంలో కొండ చరియాలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐసిఐఎంఓడి ఆందోళన వ్యక్తం చేసింది. వీరి అధ్యయనంలో చైనా, భారత్ సహా ఆసియా ఖండంలోని ఎనిమిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తల అధ్యయనంలో 200 హిమాని నదులు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల వరదల ముప్పు ఎక్కువగా ఉండి వ్యవసాయం, మంచినీటి లభ్యత, ఇంధన వరులపై, ఆహార భద్రతపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేశారు. జంతు, వృక్షజాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.