న్యూ ఇయర్ వేడుకలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో.. అందరూ పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. న్యూ ఇయర్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కొలీగ్స్, స్నేహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకుంటూ మద్యాన్ని సేవిస్తారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నుంచే సేవించిన మద్యం తాలూకూ హ్యాంగోవర్ బాధపెడుతుంది. కొత్త సంవత్సరం మొదటి రోజు అనారోగ్యం, నీరసంతో గడపాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కాబట్టి హ్యాంగోవర్ నివారణకు సంబంధించిన కొన్ని హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
త్రాగునీరు:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీరు మూత్రవిసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. దాంతో మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అప్పుడు హ్యాంగోవర్ కూడా వస్తుంది. హ్యాంగోవర్‌ను నివారించడానికి త్రాగునీరు చాలా చాలా ముఖ్యం. త్రాగునీరు రక్తంలో ఆల్కహాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి పార్టీకి ముందురోజు, మరుసటి రోజు బాగా నీరు త్రాగండి. ముఖ్యంగా పార్టీ అయిన తెల్లారి బాగా నీరు త్రాగండి. దాంతో నెమ్మదిగా మీ హ్యాంగోవర్ పోతుంది.
అల్పాహారం:
పార్టీ అయిన ఉదయం సరైన అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. తాగే సమయంలో మీరు కోల్పోయిన పోషకాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే.. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మీకు వికారంగా అనిపిస్తే.. కాస్త సమయం తీసుకొని అయినా తింటే బెటర్.
పండ్లు:
ఫ్రూట్ సలాడ్ లేదా పచ్చి పండ్లు హ్యాంగోవర్‌ను ఇట్టే తగ్గింస్తుందట. ముఖ్యంగా యాపిల్స్ మరియు అరటి పండ్లు హ్యాంగోవర్‌ను త్వరగా తగ్గిస్తాయి. అరటిపండు షేక్‌లో తేనె కలుపుకొని తాగండి. యాపిల్స్ తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి నేరుగా తిన్నా లేదా జ్యూస్ చేసుకున్నా పర్వాలేదు.
అల్లం:
హ్యాంగోవర్‌కు అల్లం గొప్ప నివారణ. ఆల్కహాల్‌ను జీర్ణం చేయడంలో అల్లం సహాయపడుతుంది, దాంతో పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది. వికారం అనుభూతిని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి చిన్న, చిన్న అల్లం ముక్కలను కూడా నేరుగా నమలవచ్చు. అల్లం టీ తాగినా హ్యాంగోవర్ తగ్గిపోతుంది.
- టమోటా రసం:
హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందడంలో టమోటా రసం అద్భుతంగా పని చేస్తుంది. టొమాటో రసంలో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ జీర్ణం కావడానికి సహాయపడుతుంది. టమోటా రసంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.