రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం వారికి సంబంధించిన సంక్షేమ నిధి నుంచి నిధులను ఎలా మళ్లిస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిధులను మళ్లించారనే విషయంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 22 లక్షల మంది రిజిస్టర్ నిర్మాణ కార్మికులు ఉన్నారని మొదట ఇసుక కొరత వలన తర్వాత కరోనా మూలంగా ఉపాధి కరువైంది, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు సరికదా వారి సంక్షేమం నుంచి 450 కోట్ల మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం తన సొంత అవసరాలకోసం ఎలా వినియోగిస్తోంది అని ఆయన మండిపడ్డారు.
కన్స్ట్రక్షన్ వర్కర్స్ అసోసియేషన్ ను సంప్రదించకుండా ఆ నిధులను మళ్ళించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని, పైగా ఇలా చేయడం రాజ్యాంగానికి విరుద్ధం అవుతుందని, ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.