Hrithik Roshan: ధురంధర్ సినిమా బాగుంది అంటూనే.. హృతిక్ రోషన్ పొలిటికల్ కామెంట్స్..
Hrithik Roshan: రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణంతో ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, తాజాగా బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీశాయి.
సినిమా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించినప్పటికీ, అందులో చూపించిన కొన్ని రాజకీయపరమైన అంశాలను మాత్రం తాను అంగీకరించలేకపోతున్నానని హృతిక్ వ్యాఖ్యానించారు. “ఈ చిత్రం నాకు బాగా నచ్చింది. ఇంతటి అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే కథను ప్రేక్షకులకు అందించినందుకు చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దర్శకులు కథను తెరకెక్కించిన విధానం అసాధారణంగా ఉంది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అనిపించింది. అయితే, ఇందులో ప్రస్తావించిన రాజకీయ అంశాలను నేను పూర్తిగా అంగీకరించలేకపోతున్నా. అయినప్పటికీ, దర్శకులు ఒక అంశంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కాబట్టి ఆ విధంగా రూపొందించి ఉంటారని నేను భావిస్తున్నా. ఒక సినీ పరిశ్రమ వ్యక్తిగా నేను ఈ చిత్రాన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను,” అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు.
నటుడి ఈ కామెంట్స్ ఇప్పుడూ నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ‘ధురంధర్’ చిత్రంలో ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని, భారత దేశంపై వారు చేసిన భయంకరమైన దాడులను వాస్తవికతకు దగ్గరగా చూపించారని, అటువంటి అంశాలను హృతిక్ రోషన్ అంగీకరించకపోవడంపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఇలాంటి చిత్రంలోని వాస్తవిక అంశాలపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో హృతిక్ రోషన్ పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
మరోవైపు ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ఇప్పటివరకూ సుమారు రూ.180 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వారాంతంలో ఈ సినిమా సులభంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హృతిక్ రోషన్ వ్యాఖ్యలు ఎంత వివాదానికి దారితీసినా, సినిమా విజయానికి మాత్రం ఎలాంటి అడ్డంకి లేదని నిరూపితమవుతోంది.
