వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా జంటనగరాల్లో రోడ్లు, కాలనీలు, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వలన ఎక్కడికక్కడ నీరు నిలిచి ఉండడం వలన నగర ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.
హిమాయత్ సాగర్ సామర్థ్యానికి మించి ఎగువ ప్రాంతాల నుండి నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి ప్రకటించింది. పోలీస్ వ్యవస్థ పూర్తిస్థాయి సిద్ధంగా ఉందని ఎలాంటి పరిస్థితి వచ్చినా 100 డయల్ చేసి సహాయం కోరమని పోలీస్ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.