బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ లుక్స్.. యానిమేషన్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దీంతో టీజర్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా హనుమంతుడు.. రావణుడు.. రాముడు లుక్స్.. వేషధారణపై విమర్శలు రావడమే కాకుండా ఏకంగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రభాస్‌తో పాటు చిత్రయూనిట్ మొత్తానికి నోటీసులు జారీ చేసింది కోర్టు.
తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు సైతం ఆదిపురుష్ టీజర్ పై స్పందించారని.. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న జిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని భారీ స్థాయిలో ఊహించుకున్నాననీ, కానీ టీజర్ చూస్తే యానిమేటెడ్‌లా ఉందని.. ప్రేక్షకుడిగా మోసపోయానని ఆయా కథనాల సారాంశం.
దీనిపై విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఫేక్ న్యూస్!! పెయిడ్ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? నేను ఊహించిన విధంగానే జరిగింది. ‘జిన్నా’ విడుదలకు ముందు కొంతమంది కావాలనే నాపై నెగిటివ్ వార్తలు పుట్టిస్తున్నారు. నా డార్లింగ్ ప్రభాస్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించి నాకేం వద్దు. జీవితంలో కొంత ఆనందించండి. తప్పుడు ప్రచారం చేయకండి. 21న ‘జిన్నా’ చూడండి. సానుకూలంగా ఉండండి’’ అని విష్ణు ట్వీట్ చేశాడు.
