అంతా ఆ వ్యక్తి చనిపోయాడనే అనుకున్నారు. అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఆ చనిపోయాడు అనుకున్న వ్యక్తి టక్కున లేచికూర్చున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన రైతు షణ్ముగం (60) గుండె, కాలేయ సమస్యలతో బాధ పడుతుండగా కుటుంబీకులు పొన్నమరావతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
గురువారం అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు షణ్ముగం మరణించినట్టు తేల్చేశారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఇంటిబయట తిన్నెపై కూర్చోబెట్టారు కుటుంబ సభ్యులు. అనంతరం షణ్ముగం కుమారుడు తమ సంప్రదాయం ప్రకారం కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలుపోశాడు. అంతే..! ఒక్కసారిగా దగ్గుతూ షణ్ముగం కళ్లు తెరిచాడు. దీంతో చుట్టూ ఉన్న బంధువులంతా బెంబేలెత్తిపోయారు. షణ్ముగం మాత్రం “ఏం జరిగింది” అంటూ లేచి నిలుచున్నాడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
