IND vs NZ : రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ 3 వికెట్లతో కివీస్ ని కోలుకొని దెబ్బ తీసాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ లు తలా ఒక వికెట్ తీశారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. దాంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో తొలి వన్డే హీరో బ్రేస్ వేల్ (22; 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
ఎట్టకేలకు కివీస్ 50 మార్కును దాటింది. బ్రేస్ వెల్, ఫిలిప్స్ 6వ వికెట్ కు 41 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన షమీ.. బౌన్సర్ తో బ్రేస్ వెల్ ఆటను ముగించాడు. దీంతో 56వ పరుగు వద్ద న్యూజిలాండ్ 6వ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సాంట్నెర్ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్, సాంట్నెర్ లు 7వ వికెట్ కు 47 పరుగులు జోడించారు. అయితే ఇక్కడి నుంచి భారత్ మరోసారి వరుస పెట్టి వికెట్లు తీసి కివీస్ ఆటను ముగించింది.