Homebound: ఆస్కార్ రేసులో నిలిచిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Homebound: భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పేలా రూపొందిన చిత్రాలు ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్నాయి. ఈ కోవలోనే 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) రేసులో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికై సంచలనం సృష్టించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అరుదైన చిత్రం ఎప్పుడెప్పుడు డిజిటల్ వేదికపైకి వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ‘హోమ్‌బౌండ్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా వెనుక ఉన్న సాంకేతిక నిపుణుల పేర్లు వింటేనే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ‘మసాన్’ వంటి క్లాసిక్ సినిమాను అందించిన నీరజ్ ఘైవాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక బాలీవుడ్ యువ తారలు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. విశేషమేమిటంటే.. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించగా, ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఒక భారతీయ సినిమాకు మార్టిన్ స్కోర్సెస్ వంటి లెజెండ్ మద్దతు లభించడం మామూలు విషయం కాదు.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చందన్ కుమార్ (విశాల్ జేత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖట్టర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పేదరికం, సామాజిక వివక్ష నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవితం గడపాలనేది వారి కల. అందుకోసం పోలీసు ఉద్యోగమే మార్గమని నమ్ముతారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పోటీపడే ఆ ఉద్యోగ వేటలో, ఉన్నవి కేవలం 3,500 పోస్టులే. అయినప్పటికీ, యూనిఫాం వేసుకోవాలనే వారి ఆశయం మాత్రం బలంగా ఉంటుంది.
చందన్, షోయబ్‌ల మధ్య మతపరమైన, సామాజిక నేపథ్యాలు వేరైనా వారి స్నేహం విడదీయరానిది. అయితే విధి వారిని ఒక పరీక్షకు గురిచేస్తుంది. పోలీసు ఎంపిక పరీక్షలో చందన్ విజయం సాధించగా, మహ్మద్ విఫలమవుతాడు. దీంతో బతుకుతెరువు కోసం మహ్మద్ ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో చేరాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో 2020లో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత విధించిన లాక్‌డౌన్ వారి జీవితాలను ఎలా తలకిందులు చేసింది? జాన్వీ కపూర్ పోషించిన ‘సుధా భారతి’ పాత్ర వీరి ప్రయాణంలో ఎలాంటి మార్పు తెచ్చింది? అనే విషయాలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. సామాజిక అసమానతలు, స్నేహం విలువ తెలియజెప్పే ఈ చిత్రాన్ని కచ్చితంగా వాచ్ లిస్ట్‌లో చేర్చాల్సిందే.
