OG Hungry Cheetah: ఓజీలోని హంగ్రీ చీతా సాంగ్ రాసింది ఒక యంగ్ రైటర్.. ఎవరంటే?
OG Hungry Cheetah: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్ రాబట్టడంలో సంగీత దర్శకుడు తమన్‌తో పాటు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ‘హంగ్రీ చీటా’ పాట కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదలకు ముందే వచ్చిన ఈ గ్లింప్స్, అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. డెత్ కోటా కన్ఫర్మ్” వంటి శక్తివంతమైన సాహిత్యం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.
ఈ పాట వెనుక ఉన్న ప్రతిభ గల వ్యక్తి ఆర్.ఆర్. ధృవన్ (రాజు రఘురామ్ ధృవన్). ఈ యువ సంగీత దర్శకుడు, రచయిత పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే క్రెడిట్స్‌లో “రఘురామ్” అని మాత్రమే ఉంది. కేవలం గేయ రచయితగానే కాకుండా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా ధృవన్ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌ను ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలోని ‘నో పెళ్లి’, ‘హే ఇది నేనేనా’ వంటి బ్లాక్‌బస్టర్ పాటలతో ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ పోతినేని ‘స్కంద’, ‘మ్యాడ్’, ‘లియో’ వంటి పలు సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
‘ఓజీ’లో ధృవన్ రాసిన “హంగ్రీ చీటా” పాటను పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సన్నివేశాలలో దాదాపు ఎనిమిది సార్లు ఉపయోగించారు. ఈ పాట పవన్ కళ్యాణ్ పాత్రలోని క్రూరత్వాన్ని, స్టైల్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. అభిమానులు ఈ పాటను “ఒక దశాబ్దం పాటు సెలబ్రేట్ చేసుకునే పాట”గా అభివర్ణించడం దానికున్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. ఈ పాట సినిమా విజయంలో ఒక కీలక భాగం కావడంతో, యువ రచయిత ధృవన్ పేరు ఇప్పుడు మరింత వెలుగులోకి వచ్చింది.