ఈ సంవత్సరం దసరా ఆదివారం నాడు వచ్చింది. ఆదివారం ఎలాగో సెలవే కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న సోమవారం నాడు దసరా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా సోమవారం 26ను ఆప్షనల్ సెలవుగా ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే నిన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. మన తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణా మరియూ కేంద్రప్రభుత్వ ఉద్యోగులకి కూడా సోమవారం నాడు సెలవు ఇచ్చారు కానీ ఆంధ్రాలో ఇచ్చారా ఇవ్వలేదా అనే గందరగోళంలో ఉండిపోయారు.
అయితే కొంతమంది ఉద్యోగులు తమకు కూడా తెలంగాణా మాదిరి సెలవు ప్రకటించాలనిఏపీ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉన్న అయోమయానికి తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26ను ఆప్షనల్ హాలిడే అంటూ నిన్న ఉత్తర్వులు జారీచేసింది.
అయితే ఇది కేవలం ఉద్యోగుల కోరికతో తీసుకున్న నిర్ణయమే అంటూ గవర్నమెంట్ ప్రకటించింది. పండుగ ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని ఉద్యోగులు కోరారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సోమవారం సెలవు ఉంటుంది అని తెలిపింది గవర్నమెంట్. కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే సెలవు ఉంటుంది కాబట్టి మిగతా ఉద్యోగులు సోమవారం విధులకు రావాల్సి ఉంటుంది.
అయితే ఈ నిర్ణయం పట్ల కొంతమంది ఉద్యోగులు(పురుషుల్లో) అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆడవారికి మాత్రమే సెలవు ఇవ్వడం ఏంటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
