భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 4,450 కోట్ల మేర వివిధ రంగాలకు నష్టం వాటిల్లిందని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి, సహాయక చర్యల కోసం తక్షణ సాయంగా 1000 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
వరద వలన ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున బృందాన్ని పంపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. గత రెండు నెలల్లో కురిసిన వర్షాలకు తోడు, తీవ్ర వాయుగుండం కారణంగా ఇప్పుడు కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట చేతికందే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న ఇలా పలు రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అంతేకాక రహదారులు చిన్నాభిన్నం అయ్యాయని, అకాల వర్షాల కారణంగా వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోయారని లేఖలో వివరించారు.
కరోనా కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టం చవిచూసిన ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడొచ్చిన అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, కావున రాష్ట్ర ప్రభుత్వానికి మీ అండ చేయూత అవసరమని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
