జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకీ అండగా నిలిచిన బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినా.. సామాజిక పరంగా వారి ఎదుగుదలకు ఏమాత్రం దోహదం పడలేదని క్రమక్రమంగా టీడీపీకి దూరమైన బీసీలు, గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు అండగా నిలిచారు. ఇప్పుడు తమకు అండగా నిలిచిన బీసీలకు సంక్షేమ పథకాలతో నిలుపుకోవడానికి జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా 56 బిసి కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను ప్రకటించింది.
దానికి సంబంధించిన జాబితాను బి.సి. వర్గానికి చెందిన మంత్రులు విడుదల చేశారు. దీనిపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వైసిపి అధికారంలోకి రావాలనే తపనతో బిసి లు పని చేశారు, వారి శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిసి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 139 బిసి కులాల వారికి కార్పరేషన్ లో చోటు కల్పించినది మరియు దేశంలోనే ఇంతమంది కి ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వడం ఎక్కడా లేదని ధర్మాన స్పష్టం చేశారు.
టిడిపి హయాంలో బిసిలను ఓట్లు కోసమే ఉపయోగించుకున్నారని, అడుగడుగునా అవమానాలు, అవహేళనలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి బిసి లకు ఏలూరులో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు.
మరో మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈరోజు చారిత్రక దినంగా మేమంతా భావిస్తున్నాం. బిసి లు అంటే, వెనుకబడిన వర్గాలు కారు. వెన్నుముక పాత్ర పోషించే వారని జగన్ చెప్పారని, సమాజంలో 139 కులాలు ఉండి, ప్రభుత్వం చేత గుర్తింపబడలేదు అనే వారికి సిఎం నిర్ణయంతో సువర్ణ అవకాశం కల్పించారని, 139 కులాలను 56 కార్పొరేషన్ ల ద్వారా బిసి లకు సంక్షేమ ఫలాలను చేరువ చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇంత మందిని ప్రజల్లోకి పంపి సేవ చేసే అవకాశం కల్పించిన సిఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
56 కార్పొరేషన్ లలో ఒక్కో కార్పొరేషన్ కు 12మంది పాలక వర్గ సభ్యులు ఉంటారు. నాణ్యత గల విద్య తోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగన్ ఇంగ్లీషు మీడియం నిర్ణయం తీసుకున్నారని,
బలహీన వర్గాల బంధువు, ఆరాధ్యదైవం గా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అణుగుణంగా బిసి లకు ప్రాధాన్యత ఇచ్చారు. 728 మంది బిసిలను కార్పొరేషన్ ల ద్వారా సేవ చేసేలా ఎంపిక చేశారు. బిసిల గర్జనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరుస్తారా అనే అనుమానం మాకు కూడా ఉంది. అధికారంలోకి వచ్చాక మా సిఎం ఆలోచనలు తెలుసుకుని మేమే ఆశ్చర్యపోయాం. బిసి లు అంటే ఓట్లు కోసం కాదు, రాజకీయ నాయకులుగా ఎదిగేలా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు.
బిసి లు అంటే చేతి వృత్తులకే పరిమితం కాదని, సమాజానికి వెన్నుముక అని జగన్ చెప్పారని బోత్స తెలిపారు. ఇప్పుడు చెప్పింది చేస్తాం.. మాట తప్పం.. మడమ తిప్పం అని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని, సిఎం తీసుకున్న నిర్ణయం, బలహీన వర్గాల కు ఇచ్చిన ప్రాధాన్యత కు మేము సిఎం ధన్యవాదాలు చెబుతున్నాం అని అన్నారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బిసి లు అంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అనే అభిప్రాయం మరియు వారి కోసం అనేక పధకాలు ప్రవేశపెడుతున్నామనే భావన రాజకీయ పార్టీలలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రతి పల్లె, ప్రతి ప్రాంతం లో స్థితిగతులను అర్ధం చేసుకున్నారని, బిసి సామాజిక వర్గాల వారు ఆర్ధికంగా ఎదగాలని జగన్ భావించారు కాబట్టి అన్ని విధాలా వారిని చైతన్య వంతులను చేసేలా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రాజకీయంగా కూడా బిసిలు ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు 56 కార్పొరేషన్ లను ప్రకటించారు. వారి సమస్యలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కారించే దిశగానే ఈ కార్పొరేషన్ లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ప్రతి కార్పొరేషన్ లో కూడా మహిళల కు యాభై శాతం చోటు కల్పించామని, ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఏకైక సిఎం గా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని ఆయన అన్నారు .