దశాబ్దాలుగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన జేసీ కుటుంబం ఇక పై కేవలం ఉనికి కోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చిందా? అసలు జేసి బ్రదర్స్ ని అధికార పార్టీ ఎందుకు ఇబ్బందుల్లోకి నెడుతుంది అనే అంశాలపై జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారింది.
సుదీర్ఘకాలంగా జేసీ కుటుంబం రాజకీయాల్లో వున్నా ఎప్పుడూ ఇంతటి దుస్థితి అనుభవించలేదు. టీడీపీ అధికారంలో ఉండగా జేసీ బ్రదర్స్ జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రతి సందర్భంలో వైసీపీ పై అత్యంత పరుషమై పదజాలంతో విరుచుకుపడేపడేవారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ పటిష్టం కోసం జిల్లావ్యాప్తంగా కృషి చేసేవారు. ఈ క్రమంలో జిల్లా వైసీపీ నాయకులకు కేడర్ కి చుక్కలు చూపించేవారు
ఎన్నికల ముందు జేసీ కుమారులకి జగన్ తో కొంత సాన్నిహిత్యం వున్న రీత్యా వారు వైసీపీ తరపున నిలబడే అవకాశం ఉందని ఒక దశలో ఊహాగానాలు వచ్చాయి. టీడీపీలో అప్పటికే ఉన్న పదవుల రీత్యా వారు మళ్లీ టీడీపీ తరపునే పోటీ చేయాల్సివచ్చింది. ఓటమి దరిమిలా వారు చేసిన వ్యక్తిగత దూషణలే వారి కొంప ముంచాయని, ట్రావెల్స్ లో జరిగిన అక్రమాల వెలికితీసి ప్రభుత్వం వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో జేసీ కుటుంబం తీసుకునే రాజకీయ నిర్ణయం పై ఈ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.