Jai Hanuman: ‘అవేంజర్స్’ రేంజ్‌లో జైహనుమాన్.. తగ్గేదేలే అంటున్న ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి
Jai Hanuman: బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘కాంతార – చాప్టర్ 1’ చిత్రం ఈ దసరా సందర్భంగా విడుదల కానుంది. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి ఈ సినిమాను రూపొందించారు. సినిమా విడుదలకు ముందే, దీని ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 125 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఈ సినిమా విడుదలతో పాటు, రిషబ్‌శెట్టి రెండు కొత్త, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అంగీకరించినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టులలో ఒకటి యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మతో కలిసి చేయబోతున్న ‘జై హనుమాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, ‘కాంతార – చాప్టర్ 1’ విడుదల సందర్భంగానే ‘జై హనుమాన్’ సినిమాకు ముహూర్తం పెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం. మరో ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ బయోపిక్. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 30 దేశాల్లో, ఏడు భాషల్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఇంగ్లీష్, బెంగాలీ భాషలను కూడా జాబితాలో చేర్చారు. ఇప్పటికే వివిధ భాషల్లో డిస్ట్రిబ్యూటర్ వివరాలను చిత్రబృందం వెల్లడించింది. అయితే, కేరళలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో సమస్యలు తలెత్తడంతో అక్కడ విడుదలపై కొంత సందిగ్ధత నెలకొంది.
ప్రశాంత్‌వర్మ గత చిత్రం ‘హను-మాన్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిపోయేలా ‘జై హనుమాన్’ కథను సిద్ధం చేశారని టీమ్ చెబుతోంది. ఈ సినిమా హాలీవుడ్ ‘అవేంజర్స్’ స్థాయి కథ, కథనాలతో ఉంటుందని, అద్భుతమైన విజువల్స్ తో దేశం గర్వపడే సినిమాగా ఇది ఉంటుందని దర్శకుడు హామీ ఇస్తున్నారు.
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్‌శెట్టి ఆంజనేయుడి పాత్రలో నటిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్టార్ హీరో పూర్తిస్థాయిలో హనుమంతుడి పాత్ర పోషించడం ఇదే తొలిసారి. ఈ విధంగా రిషబ్‌శెట్టి ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పవచ్చు. ‘జై హనుమాన్’ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది చివరికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.