ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్ర దారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు బాండ్ చిత్రాల నిర్మాణ సంస్థ వెల్లడించింది. సీన్ కానరి మృతి చెందినట్లు వెల్లడిస్తూ, ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. తమ చిత్రాల్లో నటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ కలల పాత్ర జేమ్స్ బాండ్, ఆ పాత్రకు తగిన ఒడ్డు పొడుగే కాదు, జేమ్స్ బాండ్ పాత్రకు ఒక సిగ్నేచర్ స్టైల్ క్రియేట్ చేసిన నటుడు కానరీ.. బాండ్ పాత్రలో ఉండే తెంపరితనం, ఎదుట ఉన్నవాళ్లు ఎవరైనా సరే లెక్కచేయని తత్వం, నిర్లక్ష్యంగా ఉంటూనే ఎదుటివాడిని స్కాన్ చేసేలా సూటిగా చూస్తూ నడుచుకునే ఒక క్రేజీ క్యారెక్టర్ ను ఫ్లెమింగ్ సృష్టిస్తే ఆ పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ 1962 లో తెరకెక్కిన “డాక్టర్ నో” అనే చిత్రం ద్వారా మొదటి బాండ్ గా తెరపైకి వచ్చాడు సీన్ కానరి.
ఆ తర్వాత వరుసగా 5 బాండ్ చిత్రాలలో ఆయన నటించారు. ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, తండర్ బాల్, యూ ఓన్లీ లీవ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్ చిత్రాలలో బాండ్ గా నటించారు. ఇప్పటివరకూ 7 గురు వ్యక్తులు బాండ్ పాత్రలో నటించినా, మొదటి బాండ్ గా సీన్ కానరీకి వచ్చినంత పేరు మరెవరికీ రాలేదనే చెప్పాలి.