OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జీ5 ప్రేక్షకులను అలరించడానికి మరో అద్భుతమైన చిత్రాన్ని తీసుకువచ్చింది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్ వంటి తెలుగు సూపర్ హిట్స్ తర్వాత, విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 22న ఎక్స్‌క్లూజివ్‌గా జీ5లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటులు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగి అయిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్), పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఆమెకు న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) ఎలా సహాయం చేశారు? న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఏమిటి? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ఈ చిత్రం కథతో పాటు, సాంకేతిక అంశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. రెనదివే అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
ఇటీవల థియేటర్లలో ‘పరదా’తో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు మరో మూడు వారాల్లో ‘కిష్కిందకాండ’ అనే హారర్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వీకెండ్‌ను ఒక ఉత్కంఠభరితమైన కోర్ట్ డ్రామాతో ఆస్వాదించాలనుకుంటే, ‘J.S.K’ సినిమాను జీ5లో తప్పక చూడండి.