పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ సిద్ధాంతంగా పొందుపరిచిన జనసేన పార్టీ ఎప్పటికప్పడు పర్యావరణానికి భంగం కలిగించే సంఘటనలపై తన గళం వినిపిస్తూ ఉంటుంది. ఆ పార్టీ నేతలు సామాజిక స్పృహతో పోరాటం చేసి అలాంటి చర్యలను అదుపు చేయడంలో ముందుంటారు. గతంలో అమరావతి ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేస్తే టిడిపి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అలాగే రాజోలు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై గళమెత్తి అడ్డుకట్ట వేసేలా పోరాటం చేశారు.
తాజాగా విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ నేత, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేసే బొలిశెట్టి సత్యనారాయణ.. పరవాడ ఫార్మా సిటీ లో గల ఔషధ కంపెనీల నుండి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ (శుద్ధి) చేయకుండా చుట్టుపక్కల ఉన్న చెరువుల లోకి, సముద్రంలోకి విడుదల చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం అవడమే కాకుండా, సముద్రంలోకి వదిలే వ్యర్థాల వలన మత్స్య సంపద దెబ్బతింటుదని న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ అక్కడి కాలుష్య నివారణ కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేసు విచారణ నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఫార్మా కంపెనీల నుండి వస్తున్న వ్యర్ధాల మూలంగా సమీప ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని బొలిశెట్టి సత్య నారాయణ తెలిపారు.