JanaSena Formation Day Meeting : జనసేన ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఈ రోజు మచిలీపట్నంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆ పార్టీ అధినేత పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ హాజరవుతుండడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున సభకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి తన ప్రత్యేక వాహనమైన “వారాహి “పై ర్యాలీగా బయలుదేరి సభాప్రాంగణానికి చేరుకున్నారు.
2014లో మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లో ఎన్నికలు రావడంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొద్దిరోజుల తర్వాత బిజెపి, టిడిపి పార్టీలతో పొత్తుగా ఏర్పడ్డారు. కానీ 2019 ఎన్నికల్లో బిజెపి, టీడీపీకి దూరమై బిఎస్పి వామపక్షాలతో పొత్తు పెట్టుకుని జనసేన ఓటమిపాలయ్యింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య రాబోయే ఎన్నికలకు సంవత్సరం ముందు నుండి గెలుపు కోసం
ప్రయత్నాలు మొదలుపెట్టింది జనసేన. భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ సభ వేదికగా ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పార్టీ శ్రేణులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందో అనే నిర్ణయం కూడా ఈ సభలోనే పవన్ కళ్యాణ్ తీసుకోనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ ఏం మాట్లాడనున్నాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.