Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు.. షికర్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
Janhvi Kapoor: బాలీవుడ్ యువ నటి, అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. గత కొంతకాలంగా ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ, జాన్వీ తన దృష్టి ప్రస్తుతం నటనపైనే ఉందని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని స్పష్టం చేశారు.
తాజాగా ముంబైలో జరిగిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జాన్వీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ, “ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం నా కెరీర్‌పైనే ఉంది. పెళ్లికి ఇంకా సమయం ఉంది” అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో శిఖర్‌తో పెళ్లి వార్తలకు జాన్వీ దాదాపుగా ముగింపు పలికారని చెప్పవచ్చు.
గతంలో జాన్వీ, శిఖర్‌తో కలిసి పలు ఈవెంట్లలో కనిపించడం, ఆమె ఫోన్‌లోని స్పీడ్ డయల్‌లో ‘శిఖు’ అనే పేరు ఉండటం, అలాగే ‘శిఖు’ పేరుతో ఉన్న నెక్లెస్ ధరించడం వంటి విషయాలు ఈ పుకార్లకు ప్రధాన కారణమయ్యాయి. ఈ విషయాలను జాన్వీ స్వయంగా ధృవీకరించకపోయినా, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు శిఖర్‌తో పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాయి.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే, శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమాలో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తెలుగులో ‘పెద్ది’ సినిమాలో నటిస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.